పెళ్లి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ ఏవీ ఫలించలేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పెళ్లి కావడం లేదని ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. తనకు భార్య కావాలంటూ ఊరంతా పోస్టర్లు అతికించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులోని విల్లుపురంకు చెందిన జగన్ అనే 27 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా వధువు కోసం వెతుకుతున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా అతడికి పెళ్లి కుదరడం లేదు. దీంతో జగన్ వినూత్న ప్రయత్నం చేశాడు.
నాకు మంచి భార్య కావాలి అంటూ ఊరంతా పోస్టర్లు అతికించాడు. వాటిలో తన ఫొటోతో పాటు పేరు, కులం, వేతనం, ఉద్యోగం, ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి చిన్నపాటి స్థలం కూడా తనపేరిట ఉందని అందులో పేర్కొన్నాడు. తాను ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నానని, తన జీతం రూ.40 వేలు అని పోస్టర్ లో పేర్కొన్నాడు. దీంతోపాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నానని చెప్పాడు.
జగన్ తన పెళ్లికి అమ్మాయి కోసం అనేక ఏజెన్సీలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కానీ మ్యాట్రీమోనీల యజమానులు ఎవరూ మంచి సంబంధాన్ని కుదర్చలేకపోయారు. దీంతో విసిగిపోయిన జగన్ పెళ్లి కోసం ఏకంగా పోస్టర్లు వేశాడు. మరీ ఈ పోస్టర్లతో అయినా ఈ యువకుడికి పెళ్లి కుదురుతుందో లేదో చూడాలి..