ప్రముఖ హాస్య నటుడు వివేక్ మృతి.. ప్రముఖుల సంతాపం..!

ప్రముఖ తమిళ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్(59) మరణించారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.. కాగా గురువారం వివేక్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ టీకాను తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని ప్రమోట్ కూడా చేశారు. అయితే శుక్రవారం ఉదయం సాలి గ్రామంలోని తన ఇంట్లో శ్వాస ఆడడంలేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

 అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారి గుండెపోటు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో టీకాకు గుండెపోటుకు సంబంధం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం ఉదయం వివేక్ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల పలువురు భారతీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘నా స్నేహితుడు వివేక్ ఇంత త్వరగా వదిలి వెళతాడని ఊహించలేదు. ఆలోచనలు మరియు చెట్లను నాటినందుకు ధన్యవాదాలు. మీ తెలివి తేటలు, కామెడీతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం’ అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

కాగా వివేక్ ను ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండి తెరకు పరిచయం చేశారు. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మనదిల్ ఉరుది వేండం’ అనే చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. అనంతరం హాస్యనటుడిగా కొనసాగారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో వివేక్ నటించారు. కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరోల సినిమాల్లో వివేక్ హాస్యనటుడిగా మర్చిపోలేని పాత్రలు వేశారు.. ‘శివాజి’, ‘సింగం’, ‘సింగం 2’, ‘విశ్వాసం’ సినిమాలతో తెలుగువారికి కూడా దగ్గరయ్యారు. 

 

Leave a Comment