భర్తలను మోసం చేస్తున్న భార్యలే టార్గెట్.. 18 హత్యలు చేసిన సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

మీరు శింభు నటించిన మన్మధ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో మగాళ్లను మోసం చేసిన ఆడవాళ్లను ఎంచుకుని చంపేస్తుంటాడు శింభు.. అదేవిధంగా ఇక్కడ భర్తలను మోసం చేస్తున్న మహిళలను ఎంచుకుని మరీ చంపుతున్నాడు ఓ సైకో కిల్లర్.. ఇప్పటికీ 18 మహిళలను చంపాడు.. తాజా ఈ సీరియల్ కిల్లర్ రాములును పోలీసులు అరెస్టు చేశారు.

సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ, సాయిలు అనే పేర్లు ఉన్నాయి. వృత్తిరీత్యా స్టోర్ కటర్ అయిన రాములు ప్రస్తుతం బోరబండలో నివసిస్తున్నాడు. రాములు మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె మూడేళ్లు కాపురం చేసి విభేదాలు రావడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని విడిపోయింది. 

ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం చేశాడు. ఆమె కూడా మరొకరితో సన్నిహితంగా ఉంటూ రాములు కంటపడింది. దీంతో 2003లో తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో ఆమెను హత్య చేశాడు. అప్పటి నుంచి భర్తలు ఉండి వారిని మోసం చేస్తూ వ్యభిచారం చేసే వారిని, డబ్బు కోసం పరాయి మగాడితో లొంగిపోయిన మహిళలను ఎంపిక చేసుకుని చంపుతుంటాడు. అలా ఇప్పటి వరకు రాములు 18 మందిని హతమార్చాడు. 

ఎలా చంపుతాడంటే..

రాములు ముందుగా కల్లు కాంపౌండ్లలో ఉన్న ఈ తరహా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారిలో కలిసి కల్లు తాగుతాడు. ఆపై డబ్బు ఆశ చూపి తన వెంట నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్తాడు. అక్కడ వారి పూర్వాపరాలు అడుగుతాడు. అలా వారిలో ఎవరికైనా భర్తలు ఉన్నట్లు తేలితే అంతే… సైకోగా మారి వారిపై అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత చీరతో ఉరి బిగించి లేదా బండ రాయితో మోది చంపేస్తాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖం మీద పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. ఆ మహిళల చెవి కమ్మలు, కాళ్ల పట్టీలను దొంగలిస్తాడు. ఏ ఆధారం వదలకుండా అక్కడి నుంచి పారిపోతాడు..

అలా ఎనిమిది హత్యలు చేసిన తర్వాత 2009లో సైబరాబాద్ పోలీసులు రాములును పట్టుకున్నారు. అప్పట్లో ఓ హత్య కేసులో రాములుకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2011లో మరో కేసులోనూ ఇలాంటి శిక్షే పడింది. దీంతో రాములును చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారు. అయితే అక్కడ పిచ్చిపట్టినట్లు నాటకం ఆడాడు.

దీంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాములు తప్పించుకున్నాడు. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న రాములును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. మహబూబ్ నగర్, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై కేసులు నమోదు చేశారు.  

Leave a Comment