పసివాడి కోసం.. ఒలింపిక్ పతకం వేలం వేసిన అథ్లెట్..

ఎనిమిది నెలల పసివాడి గుండె ఆపరేషన్ కోసం టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన పతకాన్ని వేలానికి పెట్టింది పోలాండ్ అథ్లెట్ మరియా ఆండ్రెజిక్. టోక్యో విశ్వక్రీడల్లో ఆగస్టు 6న జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో పోలాండ జావెలిన్ త్రోయర్ మరియా 64.61 మీటర్ల దూరం విసిరి ద్వితీయ స్థానంలో నిలిచింది. 

గత రియో ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచి కాంస్యాన్ని కోల్పోయిన మరియా టోక్యో క్రీడల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఐదు సంవత్సరాల కఠోర సాధన చేసి సాధించిన పతకాన్ని గుండె సమస్యతో బాధపడుతున్న ఎనిమిది నెలల పసివాడు మిలోస్ జెక్ ను రక్షించేందుకు వేలం వేసింది. 

ఆగస్టు 11న మరియా ఫేస్ బుక్ లో తన పతకాన్ని వేలం వేసేందుకు ఉంచింది. ఈక్రమంలో మరియా రజతాన్ని సూపర్ మార్కెట్ చైన్ జబ్కా పొల్స్ క కన్వీనియెన్స్ స్టోర్ కంపెనీ 1,25,000 డాలర్లకు దక్కించుకుంది. అయితే మరియా ఉదారతను ప్రశంసిస్తూ పతకాన్ని దక్కించుకున్న జబ్కా కంపెనీ ఆమెకు తిరిగి ఇచ్చేసింది. పిల్లవాడి ఆస్పత్రి ఖర్చులు తాము భరిస్తామని మిరియాకు హామీ ఇచ్చింది. కాగా 2019లో బోన్ ట్యూమర్ కు గురైన మరియా సర్జరీ అనంతరం కోలుకుని టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకోవడం విశేషం..

Leave a Comment