కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోడీ..!

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండి దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు నేటి నుంచి టీకా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన కోవిడ్ టీకా తొలి డోస్ వేయించుకున్నారు. 

కరోనా విషయంలో వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన కొనియాడారు. ‘ఎయిమ్స్ లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను.  ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమైంది. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలి. సమిష్టి కృషితో భారత్ ను కరోనా రహిత దేశంగా మారుద్దాం’ అంటూ ప్రధాని చెప్పుకొచ్చారు.    

కాగా, దేశంలో ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. సీరం ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్. ఈ రెండు రకాల వ్యాక్సిన్లను దేశంలోని ప్రజలకు అందిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ తెలిపింది. ఇక ప్రధాని మోడీకి రెండో డోస్ 28 రోజుల్లో ఇస్తారు. 

 

Leave a Comment