పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో రూ.257 కోట్లు.. లెక్కించేందుకు నాలుగు రోజులు..!

ఉత్తరప్రదేశ్ లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇంట్లో జీఎస్టీ, ఐటీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే.. ఈ తనిఖీల్లో రూ.257 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, ఖరీదైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారీగా పన్ను ఎగవేసినందుకు పీయూష్ జైన్ ను అధికారులు అరెస్ట్ చేశారు. 

Kanpur Raid

కాన్పూర్ కి చెందిన పీయూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం నుంచి ఈ సోదాలు సాగుతున్నాయి. కాగా పీయూష్ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు బయడపడటంతో అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే నాలుగు రోజులు పట్టింది. మొత్తంగా రూ.257 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

 కాన్పూర్ లో నాలుగు, కన్నౌజ్ లో ఏడు, ముంబాయిలో రెండు, ఢిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను అధికారులు గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేల్చారు. కన్నౌజ్ లోని పీయూష్ జైన్ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయని తెలిసింది. పన్ను ఎగవేత మొత్తంగా రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.   

 

Leave a Comment