‘అన్నయ్యకు నేను తొలి అభిమానిని’.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ శుభాకాంక్షలు..!

మెగాస్టార్ చిరంజీవి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. 

‘అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.. చిరంజీవి నాకే కాదు ఎదరికో మార్గదర్శి. నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.. ఎందరికో ఆదర్శప్రాయుడు. ఇలా చిరంజీవి గురించి ఎన్ని చెప్పుకున్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. 

ఆయనను చూస్తూ ఆయన సినిమాలను వీక్షిస్తూ ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒకస్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదువులను అలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించిన అదే విధేయత.. అదే వినమ్రత చిరంజీవి సొంతం. అందువల్లనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. 

విద్యార్థి దశలోనే సేవా భావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి.. కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవా గుణాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారు. ఆపదలో ఎవరైనా ఉన్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దాణాలు, గుప్తదాణాలు ఎన్నో చేశారు. చేస్తూనే ఉన్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారు. అందువల్లే సినీ కార్మికులు అందరూ చిరంజీవిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు. 

చిరంజీవి మా కుటుంబంలో అన్నగా పుట్టిన మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడి దీర్ఘాయుష్సు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రేమతో పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు.  

 

Leave a Comment