ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ.. మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్..!

కరోనా నియంత్రణకు రేపటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది. కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కేబినేట్ లో నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలకంగా చర్చించారు. 

ఏపీలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 తర్వాత ఎక్కడ జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. 

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు నడపకూడదని కేబినెట్ లో నిర్ణయించారు. ఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి ఇవ్వాలని, మధ్యాహ్నం నుంచి ప్రజారవాణా వాహనాలను నిలిపేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోనున్నాయి. 

ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధానికి లేక రాయాలని సీఎం జగన్ సూచించారు. 45 ఏళ్లు పైబడ్డవారికి వ్యాక్సినేషన్ లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి తీర్మానించింది. 

Leave a Comment