మూఢ భక్తితో ఇద్దరు కూతుర్ల హత్య..!

మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నాం? మన చదువులు ఏమి నేర్పిస్తున్నాయి? మూఢత్వం అంతే.. కడుపు తీనిపి కూడా చంపేస్తుంది. కన్న బిడ్డలను పాశవికంగా బలిగొన్న తల్లిదండ్రులే ఇందుకు ఉదాహరణ.. కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లే వారిని దారుణంగా హత్య చేసింది. జాతీయ బాలికా దినోత్సం రోజునే తన ఇద్దరు కూతుళ్లను పొట్టనపెట్టుకుంది. ఈ హత్య చేసిన సమయంలో కన్న తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 

వివరాల మేరకు అంకిశెట్టిపల్లెలోని మడికయల శివాలయం సమీపంలోని శివనగర్ లో పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఉంటున్నారు. పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రబుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పద్మజ మాస్టర్ మైండ్స్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(22) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

పద్మజకు విపరీతమైన భక్తి భావాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు చేసేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా మొదట చిన్న కూతురు సాయిదివ్వను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్ తో కొట్టి హతమార్చారు.

ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన తర్వాత వారు పూనకంతో ఊగిపోయారు. పుణ్యలోకాలకు వెళ్లిన ఇద్దరు కూతుళ్లు తిరిగి వచ్చేస్తారంటూ కేకలు వేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వారిలో చిన్న కూతురు దివ్వ ఏఆర్ రెహ్మాన్ ఇన్ స్టిట్యూట్ లో మ్యూజిక్ నేర్చుకుంటోంది. పెద్ద కూతురు అలేఖ్య ఏంబీఏ చేసి భోపాల్ జాబ్ చేస్తోంది.

హత్యకు గురైన వారు, హంతకులంతా పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ తిరిగి వచ్చేస్తారనే మూఢనమ్మకంతో చంపేసినట్లు ప్రాథమికంగా తేలిందని పోలీసులు తెలిపారు. యువతుల తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ సంఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తం నాయుడు కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.  

    

 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.