ఎగ్ దోశకు డబ్బులు ఇవ్వలేదని అలిగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!

ఈరోజుల్లో చిన్నచిన్న కారణాలతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకునే నిర్ణయం కన్నవారికి జీవితాంతం క్షోభ మిగిలిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్(21) బి.కొత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయి కిరణ్ కి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో ఇంట్లో అతడ్ని చాలా గారాబంగా పెంచారు. సాయి కిరణ్ తాను ఎగ్ దోశ తినాలని, డబ్బులు ఇవ్వాలని ఇంట్లో అడిగాడు. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు.

 అయితే కోపం తగ్గాక వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. సాయి కిరణ్ మాత్రం కోపంతో గ్రామానికి సమీపంలో ఉన్న గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంటలో శవం కనిపించడంతో స్థానికులు, వ్యవసాయ పనులు చేసే వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఎగ్ దోశకు డబ్బులు ఇవ్వలేదని ఇంట్లో గొడవ పడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్లు కుటుంబ సభ్యుుల తెలిపారు. అయితే ప్రేమ వ్యవహారం లేదా ఏదైనా కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.     

Leave a Comment