మనసులు గెలుచుకున్న పాక్ ప్లేయర్.. 2 రోజులు ఐసీయూలో.. అయినా వీరోచిత ఇన్నింగ్స్..!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 176 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో మహ్మద్ రిజ్వాన్ అద్భుత ఆటతీరు కనబరిచాడు. 52 బంతుల్లో 67 పరుగులు సాధించాడు…

అయితే ఈ మ్యాచ్ కి ముందు రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే.. అనారోగ్యంతో వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తులు వచ్చాయి. రిజ్వాన్ ఫ్లూ కారణంగా బాధపడుతున్నట్లు తెలిసింది.. అయితే పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సెమీస్ ముందు వరకు ఐసీయూలో ఉన్నట్లు పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ తెలిపాడు. నవంబర్ 9న రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరాడని, ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడని వెల్లడించాడు..

రిజ్వాన్ దేశం కోసం మ్యాచ్ ఆడటం కోసం ఆస్పత్రి నుంచి కోలుకుని బయటకు రావడమే కాకుండా.. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్ ఆడాడు. అతను ఫిట్ గా లేకున్నా కూడా 87 నిమిషాలపాటు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో రిజ్వాన్ 52 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేశాడు..  

అనారోగ్యంతో ఉన్నా రిజ్వాన్ చూపిన తెగువపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తన ఇన్నింగ్స్ తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ స్టార్ క్రికెటర్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఈరోజు రిజ్వాన్ దేశం కోసం ఆడటమే కాదు.. అత్యుత్తమంగా రాణించాడంటే ఊహించగలమా.. గత రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు.. రిజ్వాన్ పట్ల గౌరవభావం పెరుగుతూనే ఉంది’ అంటూ షోయబ్ అక్తర్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టు అభిమానులు రిజ్వాన్ అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.    

 

View this post on Instagram

 

A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar)

Leave a Comment