రూ.100 కోట్లు ఇస్తే.. రాజ్యసభ సీటు, గవర్నర్ పోస్ట్..!

రూ. 100 కోట్లకు గవర్నర్ పదవి, రాజ్యసభ సీటు లాంటి పోస్టులను అమ్మకానికి పెట్టిన ఓ ముఠా గుట్టు రట్టు చేసింది సీబీఐ. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం ఏడు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ దాడుల్లో నలుగురుని అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ పేర్కొంది.

మహారాష్ట్రలోని లాథూర్‌లో కమలాకర్ ప్రేమ్‌కుమార్, కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీ-ఎన్సీఆర్‌కి చెందిన మహీంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరాలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. సోదాలు చేస్తున్న సమయంలోనే మహమ్మద్ అజాజ్ ఖాన్ అనే మరో నిందితుడు పరారయ్యాడు. దీంతో అతడిపై సీబీఐ ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ స్పష్టం చేసింది.

చాలాకాలంగా వీరు ఈ రాకెట్ నడుపుతున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. కమలాకర్ ప్రేమ్ కుమార్ తనను తాను ఓ సీనియర్ సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుంటూ మోసాలకు తెరతీశాడు.. రవీంద్ర విఠల్ నాయక్, మహీంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరా, అజాజ్ ఖాన్ లకు పెద్ద స్థాయిలో పైరవీ చేసే పనులు తీసుకురావాల్సిందిగా పురమాయించాడు. చాలా పెద్ద పెద్ద వారితో తనకు పరిచయాలు ఉన్నాయని.. ఆ పరిచయాలతో ఎలాంటి పనైనా చేసి పెట్టగలనని నమ్మబలికాడు. 

ఈ క్రమంలోనే అతడితో చేతులు కలిపిన మిగతా నలుగురు నిందితులు.. పలుకుబడి కలిగిన ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకుని వారికి రాజ్య సభలో స్థానాలు, గవర్నర్ పదవితో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లోని సంస్థలకు చైర్మన్ పదవులు ఇప్పిస్తామంటూ మోసం చేసేందుకు కుట్రపన్నినట్టుగా సీబీఐ ఆరోపించింది.

Leave a Comment