ఒమిక్రాన్ ప్రతి ఒక్కరికీ సోకుతుంది..బూస్టర్లు ఆపలేవు.. అయినా ఆందోళనవద్దు..!

ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ భయాందోళనకు గురిచేస్తోంది. మన దేశంలోనూ రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగవంతంగా జరుగుతోంది. అవసరమైన వారికి బూస్టర్ డోసులు కూడా ఇస్తున్నారు. 

ఈక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జైప్రకాష్ ములియిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ని నియంత్రించలేమని ములియిల్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ బారిన పడతారని, బూస్టర్ డోసులు ఈ వైరస్ ని కట్టడి చేయలేవని చెప్పారు. అయితే ఈ వేరియంట్ కి భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనది కాదని ఆయన వెల్లడించారు. 

ఒమిక్రాన్ మనకు సాధారణ జలుబు వలే వస్తుంటుందని జైప్రకాశ్ తెలిపారు. ఒమిక్రాన్ సోకినప్పుడు మనలో 80 శాతం మందికి పైగా అది వచ్చిన విషయమే తెలియకపోవచ్చని అన్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి నుంచి చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుందని, రెండు రోజుల్లో రెట్టింపు అవుతుందని ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ వైరస్ ఉధృతిని ఆపలేమని అన్నారు. 

అదేవిధంగా కరోనా వ్యాక్సిన్లు శాశ్వత సహజ వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వలేదని ములియిల్ స్పష్టం చేశారు. బూస్టర్ డోసులు వైరస్ బారిన పడకుండా చేయగలవని ఏ వైద్య సంస్థలు కూడా స్పష్టంగా చెప్పలేదని ఆయన వెల్లడించారు. బూస్టర్ డోసులు కేవలం ముందు జాగ్రత్త చర్యగా తీసుకునే చికిత్సలో భాగమేనని, అది వైరస్ బారిన పడకుండా మాత్రం కట్టడి చేయలేదని తెలిపారు. బూస్టర్ డోస్ తీసుకున్న వారు కూడా వైరస్ బారినపడినట్లు నివేదికలు చెబుతున్నట్లు ములియిన్ పేర్కొన్నారు. ఇక భారతీయులు ఇతర దేశాల మాదిరిగా తీవ్రంగా ప్రభావితం కాలేదని, వైరస్ ని ఎదుర్కోగల సహజ రోగ నిరోధక శక్తి మనలో ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ రాకముందు మన దేశంలో దాదాపు 85 శాతం మంది వైరస్ బారిన పడినట్లు ములియిల్ వెల్లడించారు. 

 

  

Leave a Comment