వలస కార్మికుల మరణాలపై డేటా లేదు.. పరిహారం ఇవ్వలేం – కేంద్రం

వలస కార్మికుల మరణాలపై ఎటువంటి సమాచారం లేదని, కాబట్టి పరిహారం ఇవ్వలేమని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు..వారికి ఆర్థిక సహాయం లేదా పరిహారం గురించి పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాతపూర్వకంగా ప్రశ్నించాయి. వలస కార్మికుల మరణాలపై ఎలాంటి డేటా లేదని, అందువల్ల పరిహారం గురించి ప్రశ్నే లేదని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోటి మందికిపై వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చారని అంగీకరించింది. 

కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకపడ్డాయి. లాక్ డౌన్ సమయంలో ఎంత మంది వలస కూలీలు మరణించారో, ఎన్ని ఉద్యోగాలు పోయాయో మోడీ ప్రభుత్వానికి తెలియదా అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మీరు లెక్కించకపోతే, మరణాలు సంభవించలేదా’ అంటూ ప్రశ్నించారు. ఇన్ని మరణాలు సంభవించినా ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం విచారకరమన్నారు. వారి మరణాలను ప్రపంచం చూసిందని, ప్రభుత్వానికి మాత్రం సమాచారం లేదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

కరోనా వైరస్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో లక్షలాది మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి, ఆశ్రయం లేక నిరాశకు గురయ్యారు. చాలా మంది తమ సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్లారు. ఈ సమయంలో వారు అలసిపోయి, ఆకలితో మరియు అనారోగ్య కారణంగా ఇళ్లకు చేరుకోకముందే మరణించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

Leave a Comment