పెద్దలు ఒప్పుకోరని.. ప్రేమ జంట ఆత్మహత్య..!

తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకోరని భయపడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పొస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు పొస్కల్ గ్రామానికి చెందిన కోండ నిశిత(18) మామడ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. ఇదే గ్రామానికి చెందిన సిలివేరి హరీశ్(21) నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరిది ఒకే కాలనీ కావడంతో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు. దీంతో పెద్దలకు తెలిస్తే ఒప్పుకోరని భావించారు. ఎలాగూ కలిసి జీవితాన్ని పంచుకోలేమని, కనీసం చావులోనైనా ఒకటవుదామని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో నిశిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ ఆమె ఇంటికి వెళ్లాడు. వారు అనుకున్నట్టు ఇద్దరు ఒకే చీరకు ఉరేసుకున్నారు. 

ఆత్మహత్యకు ముందు హరీశ్ తన వాట్సాప్ స్టేటస్ లో తాము చనిపోతున్న సమాచారాన్ని ఉంచాడు. ఇది చూసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఫోన్ చేయడగా స్విచాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు అనుమానంతో వెతకగా.. నిశిత ఇంట్లో విగత జీవుతుగా కనిపించారు. దీంతో ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

 

Leave a Comment