కరోనా ఫోబియా : భర్త సంసారానికి పనికి రాడనీ కోర్టుకు వెళ్లిన భార్య..

కరోనా వైరస్ దేశంలో ఎంతో మంది బతుకులను అతలాకుతలం చేసింది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కష్టాలు పడ్డారు. తమకు కరోనా ఏవిధంగా నైనా సోకవచ్చని భయభ్రాంతులకు గురయ్యారు. ఎంతలా అంటే చివరికి కొత్తగా పెళ్లయిన యువకుడు తన భార్య దగ్గరకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందని భయపడ్డాడు. 

కరోనా భయం చివరికి ఆ యువకుడికి కష్టాలు తెచ్చిపెట్టింది. తన భర్త సంసారానికి పనికి రాడనీ, భరణం ఇప్పించాలని భార్య కోర్టుకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ జంటకు ఈ ఏడాది జూన్ 29న పెళ్లయింది. అప్పటికే దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి.

కరోనా భయంతో ఆ యువకుడు తన భార్య దగ్గరకు వెళ్లేందుకు భయపడ్డాడు. భార్య మాత్రం తన మొదటి రాత్రి కోసం చాలా ఆతృతగా ఎదురు చూసింది. ఈ రోజు జరుగుతుందిలే.. అనుకుంటూ ఉండేది. ఇలా మూడు నెలలు గడిచిపోయాయి. భర్త తన దగ్గరికే రావడం లేదు. మూడు నెలలు అత్తవారింట్లోనే ఉన్న ఆ యువతి తీవ్ర వేదనతో పుట్టింటికి వెళ్లిపోయింది. 

పుట్టింట్లో రెండు నెలలు గడిపింది. ఈ తర్వాత డిసెంబర్ 2న తనకు భరణం కావాలంటూ భూపాల్ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. పెళ్లయి ఐదు నెలలు అయినా భర్త తన వద్దకు రాలేదని, అత్తమామలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయితే తన భర్త ఫోన్ లో బాగా మాట్లాడేవాడని పేర్కొంది. 

న్యాయాధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా ఫోబియాలో ఆ యువకుడు దాంపత్య విధిని నెరవేర్చలేదని తేలింది. ఆ యువకుడికి వైద్య పరీక్షలు చేసి అంతా సరిగ్గా ఉందని ధ్రువీకరించారు. కౌన్సిలింగ్ అనంతరం ఆ యువతి భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లి పోయింది.   

 

Leave a Comment