వైరస్ అంతం కాలేదు.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ్ : ప్రముఖ వైరాలజిస్ట్..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో ఇది అంతరించిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ లిప్ కిన్ సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ అంతరించిపోలేదని, అప్రమత్తంగా లేకపోతే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. 

ఓ జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కరోనా ముగిసిపోయిందని కచ్చితంగా చెప్పలేమని, అది పుట్టుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉందని అన్నారు. కరోనా సుదీర్ఘ కాలం కొనసాగితే వైరస్ బాధితులు తేలికపాటి లక్షనాలను మాత్రమే కలిగి ఉంటారని చెప్పారు. కొందరికి మాత్రం ఆలోచన శక్తి తగ్గిపోతుందని, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. కరోనా తగ్గినా వారిలో ఈ లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. మరో ఏడాదిలో ప్రపంచంలోని 90 శాతం మందికి టీకాలు అందుతాయని, అయినా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని ఆయన సూచించారు. 

కొత్త ఇన్ ఫ్లుయెంజా వైరస్ నిరంతరం అభివృద్ధి చెందుతుందని, ఇది మమ్మల్ని మరోసారి సవాలు చేసే అవకాశం ఉందని లిప్ కిన్ భయాందోళన వ్యక్తం చేశారు. ఫూ, హెచ్ఐవీ వంటి వాటి గురించి ఆందోళన చెందుతున్నానని, వీటిని సులభంగా నివారించవచ్చని, వీటి నివారణకు బడ్జెట్ కేటాయించాలని లిప్ కిన్ తెలిపారు. అయితే ఇండియాలో స్కూల్స్ ఓపెన్ చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఇండియాలో తక్కువ శాతం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నారని, ఈనేపథ్యంలో పాఠశాలలను ప్రారంభించకూడదని లిప్ కిన్ సూచించారు.  

Leave a Comment