కరోనాకు కొత్త వైద్యం..ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు నిరంతరం పోరాడుతున్నాయి. కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ తయారు చేసేందుకు అహర్నిశలు పనిచేస్తేన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కేంద్రంగా పని చేసే ఓ ఫార్మా సంస్థ కొత్త రకం చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ ప్రతిపాదించిన  కొత్త చికిత్స విధానానికి ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మహారాష్ట్ర కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా సంస్థ గ్లెన్ మార్క్ కరోనా బాధితులకు అందించే చికిత్సలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఫావిపిరావిర్, యుమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరల్ మెడిసిన్లను కలిపి కరోనా కోసం కొత్త చికిత్స విధానాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తక్కువ కరోనా లక్షనాలతో ఆస్పత్రుల్లో చేరిన 158 మందికి ఈ విధానంలో చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు గ్లెన్ మార్క్ ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా మాట్లాడుతూ వివిధ వైరస్లను సమర్థంగా నియంత్రించే యాంటీ వైరల్ ఏజెంట్లను కలిపి రూపొందించే చికిత్సా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయని చెప్పారు. శరీరంలో వైరస్ ప్రవేశించే తొలిదశలో ఉన్నప్పుడే ఈ విధానం మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే కరోనాను చాలావరకు నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Leave a Comment