గ్యాస్ బుకింగ్ కు కొత్త రూల్స్ ..ఓటీపీ చెబితేనే సిలిండర్..!

ఫోన్, ఆన్ లైన్ లో గ్యాస్ బుకింగ్ చేసుకుంటే ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్స్ ద్వారా సిలిండర్లు ఇంటికి సరఫరా చేసేవారు. ఇప్పటివరకు ఇదే విధానం అమలవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సిలిండర్లను నల్ల బజారుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. 

ఇది వరకే ఓటీపీ నంబరు వస్తున్నా పెద్దగా పట్టించుకునేవారు కారు. ప్రస్తుతం ఈ నంబర్ ఇస్తేనే సిలిండర్లను సరఫరా చేయనున్నారు. ఒకప్పుడు గ్యాస్ బుక్ చేసుకునేందుకు ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్ చేయాల్సి వచ్చేది. వారు కొన్ని సార్లు ఫోన్లు తీయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొందరైతే సుదూర ప్రాంతంలో ఉన్న ఏజెన్సీల వద్దకెళ్లి నమోదు చేసుకునేవారు. 

ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఆన్ లైన్, యాప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటి వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీ గ్యాస్ సిలిండర్లను కొందరు అక్రమార్కులు వ్యాపార, వాణిజ్య అవసరాలకు దారి మళ్లిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో దీనిని నిరోధించేందుకు తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓటీపీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ద్వారా సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే గ్యాస్ కంపెనీ వద్ద నమోదైన ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. వినియోగదారుడికి సిలిండర్ ఇచ్చే సమయంలో ఓటీపీని డెలివరీ బాయ్ కు చెప్పాల్సి ఉంటుంది. 

Leave a Comment