బుర్ఖాలో దుర్గా మాత.. కోల్ కతా ఆర్టిస్ట్ పై నెటిజన్లు ఫైర్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. అందులో ఏముందని అనుకుంటున్నారా?.. పశ్చిమ బెంగాల్ కు చెందిన సనాతన్ దిండా అనే ఆర్టిస్ట్ ఓ డ్రాయింగ్ వేశాడు. అందులో దుర్గామాతకు బుర్ఖా వేశాడు. ఆ ఫొటోను సోషల్ మీడియా షేర్ చేస్తూ ‘అమ్మ వస్తోంది’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. సనాతన్ దిండా దుర్గా మాతను హిజాబ్ లో చూపించాడంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కేయా ఘోష్ పేర్కొన్నారు. అయినా అతడు తప్పించుకోగలడని, ఎందుకంటే బెంగాల్ లో ఎంతో మంది మేధావులు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. 

ఈ కామెంట్లపై ఆర్టిస్ట్ సనాతన్ దిండా స్పందించాడు. ఈ ఫొటోలో ఉన్నది దుర్గా మాత అనే ఎందుకు అనుకోవాలని, తన వరకైతే ఆమె ఒక మహిళ అని తెలిపాడు. తాను ఎక్కడ కూడా బుర్ఖా లేదా హిజాబ్ అని రాయలేదన్నాడు. ఈ పురుషాధిక్య సమాజం నుంచి తన సౌందర్యాన్ని కాపాడుకుంటున్న మహిళగానే చిత్రించానని పేర్కొన్నాడు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అణచివేతను ఉద్దేశించి గీసిన చిత్రం ఇది అన్నాడు. ఈ ఫొటో మత, ప్రాంత సరిహద్దులకు అతీతమైందని దిండా చెప్పాడు. 

అంతేకాదు బుర్ఖాను తాను ఓ సానుకూలాంశంగా చూస్తానన్నాడు. జలగల్లాంటి పురుషుల చూపుల నుంచి స్త్రీలను అది రక్షిస్తుందని దిండా చెప్పాడు. ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినా.. తనపై ఒత్తిడి తెచ్చి ఈ ఫొటోను తొలగించేలా చేశారన్నారు. బలవంతంగా క్షమాపణ చెప్పించారన్నారు. అంతేకాదు తన కూతురిని రేప్ చేస్తామని కూడా కొందరు బెదిరించారని దిండా వెల్లడించాడు. చరిత్ర తెలియని నిరక్ష్యరాస్యులు, మతం, ఆధునిక కళ గురించి తెలియని వాళ్లే దీనిపై విమర్శిస్తున్నారని మండిపడ్డారు.    

Leave a Comment