ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక.. యువకుడు ఆత్మహత్య..!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్క విద్యార్థికీ ఓ కలగా ఉంటుంది.. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేది అందరూ సాధించలేరు. దీంతో చాలా మంది ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చేస్తుంటారు. కానీ సమాజంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే ఏదో గొప్పగా భావిస్తుంటారు. ప్రైవేట్ ఉద్యోగాన్ని చిన్న చూపు చూస్తుంటారు.. అలా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక, తల్లిదండ్రుల కోరికను తీర్చలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మలక్ పేట చెరువులో శవమై తేలాడు.. 

వివరాల మేరకు నారాయణ పేట ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు నరసింహా(23). బీఎస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా శామీర్ పేటలోని ఓ గదిలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి రాకపోవడంతో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. 

అయితే నరసింహ తన గ్రామానికి వెళ్లినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావని తల్లిదండ్రులు అడుగుతుంటారు. దీంతో నరసింహా మనస్తాపానికి గురయ్యాడు. తన తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ఈక్రమంలో ‘ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్లే మనుషులా.. ప్రైవేట్ ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 

రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో అతడి స్నేహితులు వెంటనే తల్లిదండ్రులకు చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి సోమవారం ఉదయం లాల్ గడి మలక్ పేట గ్రామంలోని మల్క చెరువులో శవమై కనిపించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Leave a Comment