వైసీసీ కథ తేల్చాలి..! : చంద్రబాబు

అమరావతి : స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నో ఎన్నికలు సమర్ధంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో వీరోచితంగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం, కోర్టుల్లో న్యాయ పోరాటం చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అందరూ ధైర్యంగా పోరాడాలని, వైసీపీ వాళ్ల కథ తేల్చాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ డబ్బు పంపిణీ చేస్తే వీడియోలు తీయండి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని, ఫొటోలు, వీడియో తీసి పంపాలని నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపాలని, మీడియాను సద్వినియోగం చేసుకోవాలని,వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. యువ నాయకత్వం ఎదిగే అవకాశం ఇదే అని పేర్కొన్నారు. స్థానిక నేతలుగా యువతను ప్రోత్సహించాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

మళ్లీ గెలిపిస్తే అంతే.. 

 ఒక్క అవకాశం ఇస్తే ఉన్నవి ఊడగొట్టారని, సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ గెలిపిస్తే ఇక ఏమీ మిగిల్చరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని జగన్ బెదిరింపులకు దిగారని విమర్శించారు. 10% రిజర్వేషన్లు బీసీలకు తగ్గించి ద్రోహం చేశారని మండిపడ్డారు. సీఏఏ, ఎన్పీఆర్‌పై జగన్నాటకాలు ఆడుతున్నారన్నారు. 

Leave a Comment