వివాదానికి తెర : కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు..!

వారణాసిలో ఎంతో కాలంగా నడుస్తున్న భూ వివాదానికి చెక్ పడింది. ముస్లిం మతపెద్దలు తీసుకున్న నిర్ణయం కొత్తస్ఫూర్తిని నింపింది. కొంత కాలంగా కాశీ విశ్వనాధ ఆలయానికి జ్ఞానవాపి మసీదుకు మధ్య భూవివాదం ఉంది. ఈ వివాదానికి ముగింపు పలుకుతూ కాశీ విశ్వనాధ కారిడార్ కోసం 1700 చదరుపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాధ ఆలయ ట్రస్టుకు అందించారు. 

ఇందుకు ప్రతిగా కాశీవిశ్వనాథ ఆలయానికి దూరంగా 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఆలయ పాలకవర్గం ఇచ్చింది. వాస్తవానికి ఈ వివాదం ఇప్పటికీ కోర్టులోనే నడుస్తోంది. అయితే ఆలయానికి భూమిని ఇవ్వాలని, అందుకు ప్రతిగా భూమిని ఇస్తామన్న ప్రతిపాదనను ముస్లిం మతపెద్దలు ముందుకు వచ్చి ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాగా, కాశీ విశ్వనాధ ఆలయానికి, అక్కడే ఉన్న మసీదుకు మధ్య వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, ఆలయం స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందన్న వివాదం ఎప్పటి నుంచో ఉంది.

ఆలయం తరపున విజయ్ శంకర్ రస్తోగి కోర్టును ఆశ్రయించారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందిందని పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంపై వారణాసి కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సర్వే జరిపేందుకు అనుమతులు ఇచ్చింది. మందిరం మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న కోర్టు ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసింది. తాజాగా వివాదానికి చెక్ పెడుతూ ముస్లిం మతపెద్దలు భూమిని ఆలయానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

 

Leave a Comment