అధికార పార్టీ నాయకుడినీ వదల్లేదు..

ఢిల్లీ అల్లర్లో బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడి హత్య

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో దుండగులు ముస్లిం అనే కారణంతో బీజేపీ నాయకుడినీ వదల్లేదు. నోయిదా సెక్టార్-5కు చెందిన మొహసిన్ అలీ(23) ..బీజేపీ నాయకుడు. ఓ పనిమీద సోనియా విహార్ కు వెళ్లిన అతడు తిరిగిరాలేదు. సంఘ్ పరివార్ దుండగులు అతడి కారుకు నిప్పంటించి అందులోనే అలీని సజీవదహనం చేశారు. మృతుడి బంధువు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ప్రదేశ్ కు చెందిన మొహసిన్ అలీ, హపూర్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు. కొద్ది రోజుల క్రితం నుంచి నోయిడాలో ఉంటున్న అలీ..శుభకార్యాలయాలకు జనరేటర్లు బిగించే పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఒక వివాహా కార్యక్రమం నిమిత్తం గతనెల 25న అల్లర్లు చోటుచేసుకున్న సోనియా విహార్కు వెళ్లాడు. అల్లర్ల నేపథ్యంలో అతడి బంధువులు పలుమార్లు ఫోన్ చేసినా అలీ స్పందించలేదు. మరుసటి రోజు రాత్రి కరవల్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వారి ఇంటికీ ఫోన్ వచ్చింది అక్కడికి సమీపంలో ఉన్న జీటీబీ ఆస్పత్రికి వెళ్లాలనీ, అక్కడో గుర్తు తెలియని శవాన్ని గుర్తు పట్టాల్సిందిగా పోలీసులు చెప్పారు. దీంతో హూటాహుటిన అక్కడకు వెళ్లిన అలీ తల్లిదండ్రులు, మేనమామ..పూర్తిగా కాలిపోయి గుర్తించడానికి వీలుగా లేని అలీ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కొన్ని శరీర భాగాలను గుర్తించి తమ కొడుకే అని నిర్ధారించినా..పోలీసులు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది.

దీనిపై మృతుడి స్పందిస్తూ..‘ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం.?పోలీసుల పర్యవేక్షణలో ప్రజలను మతం ఆధారంగా చంపుతుంటే ఏం చేసేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలీ బీజేపీ నాయకుడని, రేయింబవళ్లు పార్టీ కోసమే కష్టపడినా దుండగులు మాత్రం అతడిని మతం ఆధారంగా అన్యాయంగా చంపేశారని అన్నారు. అలీ ఫేస్ బుక్ ఖాతాలో యూపీ, ఢిల్లీలకు చెందిన నాయకులతో దిగిన ఫొటోలు ఉన్నాయి.

తన అల్లుడు చనిపోయినా ఒక్క బీజేపీ నాయకుడు పరామర్శించడానికి తమ వద్దకు రాలేదని, ముస్లింలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అలీయే గాక.. ఢిల్లీ బీజేపీ మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడైన అక్తర్ రజా ఇంటిపైనా అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. దీంతో అతడి ఇంటితో పాటు ఇంట్లోని సామాన్లు కాలిపోయాయని రజా తెలిపారు. 

Leave a Comment