చెత్త పన్ను కట్టలేదని.. షాపుల ముందు చెత్త వేసిన మున్సిపల్ సిబ్బంది..!

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం అందరినీ షాక్ కి గురిచేసింది. చెత్త పన్ను కట్టలేదని షాపుల ముందు చెత్త వేశారు. నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన పనికి దుకాణాదారులు అందరూ విస్తుపోయారు. వివరాల మేరకు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు చెత్త పన్ను వసూలు చేసేందుకు సచివాలయ పారిశుధ్య సిబ్బంది వెళ్లింది. 

అయితే దుకాణాదారులు మాత్రం చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఆస్తి, నీటి పన్నుతో పాటు దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ ల రుసుం చెల్లిస్తున్నామన్నారు. దీంతో నగరపాలక సంస్థ సిబ్బంది సహనం కోల్పోయింది. నగరంలో సేకరించిన చెత్తను పాతబస్టాండ్ అనంత కాంప్లెక్స్ ఎదుట పలు షాపుల ముందు పడేసి వెళ్లిపోయారు.

ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ చెత్త పన్ను వసూలు చేయడం లేదని షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.200 చెత్త పన్ను కట్టలేమని అంటున్నారు. చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే చెత్త పన్ను కట్టకపోతే ఇలాగే ఉంటుందని సిబ్బంది చెప్పనట్లు సమాచారం.  

Leave a Comment