50 మంది చిన్నారులను దత్తత తీసకున్న ఓ మహిళా కానిస్టేబుల్..!

ఓ మహిళా కానిస్టేబుల్ పెద్ద మనుసు చాటుకుంది. 50 మంది పిల్లలను దత్తత తీసుకుంది. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపింది. ముంబైకి చెందిన మహిళా కానిస్టేబుల్ షేక్ రెహానా తన మానవత్వం చాటుతోంది. రెహానా షేక్ ఓ వైపు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటుంది. 

నిరుపేదల బాలబాలికల చదువుకు రెహానా సహకరిస్తుంది. ఇలా 50 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూడటమే కాదు.. చదువుకోవడానికి సహాయం చేస్తుంది. గత కొద్దిరోజుల క్రితమే రెహానా ఎస్సై టెస్ట్ పాసయ్యారు. ఆమె భర్త కూడా డిపార్ట్మెంట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇక వారి కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వారి బాగోగులు చూడటమే కాకుండా ఇప్పుడు మరో 50 మందిని చిన్నారులను దత్తత తీసుకుంది రెహానా..

రెహానా మాట్లాడుతూ.. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్రెండ్ ఒక పాఠశాలకు చెందిన కొన్ని ఫొటోలు చూపించారని చెప్పింది. అక్కడ పిల్లలను చూసిన తర్వాత వారికి తన సమాయం అవసరమని గ్రహించానని తెలిపింది. దీంతో ఆ 50 మంది పిల్లలను దత్తత తీసుకున్నానని చెప్పింది. పదో తరగతి వరకు వారి విద్యా ఖర్చులను తానే భరిస్తానని తెలిపింది. 

అంతే కాదు కరోనా మహమ్మారి సమయంలో రక్తం, ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్ కావాలంటూ తనను ఆశ్రయించిన వారందరికీ తన శక్తి మేరకు సాయం చేసింది రెహానా.. రెహానా చేస్తున్న సేవలను గుర్తించిన నగర కమిషనర్ హేమంత్ నాగ్రేల్ ఆమెను ప్రశంసించారు. సన్మానం చేసి ప్రశంసా పత్రం అందించారు. 

 

Leave a Comment