సమాధిలో నుంచి ఏడుపు శబ్దాలు.. తవ్వి చూస్తే మూడేళ్ల చిన్నారి..!

బీహార్ లోని ఛాప్రా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సమాధిలో నుంచి ఓ చిన్నారి ఏడుపు శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు మట్టిని తవ్వి చూడగా ఓ చిన్నారి ప్రత్యక్షమైంది.. వివరాల మేరకు జిల్లాలోని కోపా గ్రామంలోని మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో సమాధిలో నుంచి చిన్నారి ఏడుపు శబ్దం వినిపించింది.. 

అక్కడ ఉన్న స్థానికులు పరిశీలించి చూడగా.. సమాధిపై మట్టి కదులుతూ కనిపించింది. దీంతో దెయ్యం అనుకొని వారంతా భయంతో పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులకు ఈ విషయాన్ని చెప్పండంతో.. వారు అక్కడికి చేరుకుని సమాధిని తవ్వి చూడగా.. ఓ 3 ఏళ్ల చిన్నారి కనిపించింది. తీవ్ర గాయాలతో, నోట్లో నుంచి మాటలు కూడా రాలేనంతగా భయంతో ఉంది. 

స్థానికులు ఆమెను చేరదీసి మంచి నీళ్లు తాగించి..ఆహారం తినిపించారు. ఆ తర్వాత వివరాలు అడిగారు.. ఆ చిన్నారి పేరు లీలా అని, తండ్రి రాజుశర్మ, తల్లి రేఖా దేవి అని చెప్పింది. తన అమ్మ, నానమ్మ కలిసి తనను బయటకు తీసుకొచ్చారని, తర్వాత తన గొంతు కోస్తుంటే గట్టిగా ఏడ్చానని, దీంత నానమ్మ తన నోట్లో మట్టి పోసిందని బాలిక చెప్పింది. తనను మట్టిలో పూడ్చి పెట్టారంటూ ఆ చిన్నారి ఏడుస్తూ చెప్పింది. 

ఈ విషయంపై స్థానికులు కోపా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థానికి చేరుకుని ఆరా తీశారు. ప్రథమ చికిత్స అనంతరం బాలికను చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Leave a Comment