కేసీఆర్ సభ టైంలో హైదరబాద్ లో మోడీ పర్యటన.. ప్లాన్ అదేనా?

జీఎచ్ఎంసీ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇప్పటికే వాతావరణ వేడెక్కింది. ఈ ఆదివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా, శనివారం ఉత్కంఠ పరిస్థితి ఉత్పన్నం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 

కాగా అదే రోజు ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు.  మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నట్లు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు చేరుకుంటారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కోవాక్సిన్’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని మోడీ ఈ పర్యటనకు వస్తున్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లిపోతారు.  

ప్లాన్ అదేనా?

ప్రధాని మోడీ కరోనా వాక్సిన్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వస్తున్నప్పటికీ ఆయన ఎంపిక చేసుకున్న సమయంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా రెండు వారాల ముందు ఖరారవుతుంది. కానీ ఈ టూర్ ఆకస్మికంగా ఖరారైంది. 

దాదాపు 30 వేల మందితో కేసీఆర్ తో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్న టీఆర్ఎస్ కు కౌంటర్ గానే ప్రధాని మోడీ పర్యటనను బీజేపీ ప్లాన్ చేసి ఉంటుందనే చర్య రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ చివరి అస్త్రంగా ప్రధాని మోడీని నగరానికి రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియా కూడా ప్రధాని పర్యటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఎలాగైన కేసీఆర్ సభను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని పర్యటను బీజేపీ ఖరారు చేసినట్లు సమాచారం..     

Leave a Comment