అంతరిక్షంలోకి మోడీ ఫొటో, భగవద్గీత..!

ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. ఈనెల 28 పీఎస్ఎల్వీ సీ-51 ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజోనియా-1, భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యూనిటీ శాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. 

 ఇందులోని ఓ ఉపగ్రహంలో ప్రధాని మోడీ ఫొటోతో పాటు భగవద్గీతను, 25 వేల మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన సతీశ్ ధావన్ శాటిలైట్ లో వీటిని తీసుకెళ్లనున్నట్లు సంస్థ సీఈవో డాక్టర్ కేసన్ తెలిపారు. 

గతంలో విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలకు చెందిన బైబిల్ ను అంతరిక్షంలోకి పంపాయని, తాము కూడా హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను నింగిలోకి పంపాలని నిర్ణయించామని కేసన్ అన్నారు. ఈ ఉపగ్రహాలు భారతదేశంలో తయారైనందున ప్రధాని మోడీ ఫొటోతో పాట, ‘ఆత్మనిర్భర్ మిషన్’ పేరు ఉన్నాయన్నారు.

అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25 వేల ఎంట్రీలు వచ్చాయని కేసన్ తెలిపారు. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్ పాస్ లు ఇచ్చామన్నారు. ఇక ప్యానెల్ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్ శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ పేర్లను చెక్కినట్లు తెలిపారు.  

Leave a Comment