ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. జగన్ ప్రభుత్వంపై తీరుపై టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఇటు నందమూరి, అటు నారా కుటుంబ సభ్యులు ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ వర్సిటీ పేరు మార్చి మహానేతను అవమానించారని మండిపడ్డారు.
తాజాగా ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘’NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
తాజాగా ఎన్టీఆర్ అంశంలో ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్లు చేశారు. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు నారావారి పార్టీగా మారిందని అన్నారు. ఎన్టీఆర్ మనవళ్లూ ముందు దానిపై పోరాడాలని అనిల్ కుమార్ సూచించారు. నందమూరి అంటే ఒక బ్రాండ్ అన్నారు. ఆయన మనవళ్లుగా పుట్టి ట్వీట్లు చేయడం కాదు..ఆ పార్టీని లాక్కోండి అని పిలుపిచ్చారు. తెలుగు దేశం పార్టీ మీది.. ఫస్ట్ దాని కోసం తొడలు కొట్టండి అన్నారు. ఊరికే సౌండ్ చేయడం కాదు.. ముందు మీ తాత పార్టీని నారా నుంచి లాక్కోండి అన్నారు. నందమూరి వంశాన్ని చంపేశారు.. ఇప్పుడంతా నారానే ఉందని ఆయన కామెంట్ చేశారు.