పెళ్లి వద్దని పారిపోయింది.. ఏడేళ్ల తర్వాత సివిల్స్ కొట్టి తిరిగొచ్చింది..

ఎవరైనా వివాహమా? కెరీరా అంటే..ముందుకు కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలైతే ముందుగా జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటున్నారు. కానీ ఇంట్లో మాత్రం ఆడబిడ్డకు పెళ్లి చేసి పంపిస్తే తమ బాధ్యత తీరిందనుకుంటారు. యూపీలోని మీరట్ లో అలాంటి ఘటనే జరిగింది. జీవితంలో స్థిరపడాలనుకుంటున్న అమ్మాయికి పెళ్లి చేసి పంపాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అమ్మాయికి ఒత్తిడి చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం వారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోయి సివిల్స్ కొట్టి ఇంటికి తిరిగొచ్చింది..ఎందరో ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది..

మీరట్ కు చెందిన Sanju Rani Varma(28) తల్లి 2013లో మరణించింది. దీంతో ఆమె చదువును మానిపించి తండ్రి పెళ్లి చేయాలని భావించాడు. దానికి సంజు అంగీకరించలేదు. పెళ్లి ఇష్టం లేని Sanju Rani Varma కుటుంబ సభ్యులను వ్యతిరేకించి ఇంట్లో నుంచి ఢిల్లీకి పారిపోయింది. అప్పటికే ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ కూడా చేసింది. అనంతరం యూపీపీఎస్సీ పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ర్యాంకు సాధించింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఎంపికై తన ఊరికి తిరిగివచ్చింది.  

అయితే ఇంటి నుంచి పారిపోయి వచ్చిన Sanju Rani Varma ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. తన ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పింది. ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఏడేళ్ల పాటు కష్టపడి చదివి తాను అనుకున్నది సాధించింది. దీనిపై Sanju Rani Varma మాట్లాడుతూ తాను తీసుకున్న నిర్ణయంతో కుటుంబ సభ్యులందరూ కోపంగా ఉన్నారని, అయితే అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు తనను మెచ్చుకుంటున్నారని చెప్పింది. యూపీఎస్సీ అధికారి కావడం సంతోషంగా ఉందని, కుటుంబం పట్ల తన బాధ్యత ఏంటో తనకు తెలుసని పేర్కొంది. అమ్మాయిలను చదువుకోనివ్వకుండా పెళ్లి పేరుతో ఒత్తిళ్లు చేయడం మానుకోవాలని సూచించింది. అందరూ ఉన్నత విద్య చదువుకుని వారి కలలను నిజం చేసుకోవాలని సంజూ యువతకు సందేశమిచ్చారు.  

Leave a Comment