అబ్బా ఏం నటించారు.. వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు వైద్యాధికారుల నటన..

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఈనెల 16 నుంచి ప్రారంభించింది. అయితే కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని వస్తున్న పలు వార్తలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ప్రజల్లో ధైర్యాన్ని నింపి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ఇందులో భాగంగా కర్నాటకకు చెందిన వైద్యాధికారులు తాము వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు నటిస్తూ ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాటకలోని తుమ్కూరు ప్రాంతంలో ఇటీవల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తొలి రౌండ్ వ్యాక్సిన్ లు స్థానిక డీఎంఓ నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రజనీలకు వేయాలి. అయితే వీరు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఫొటోలకు, వీడియోలకు పోజులివ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఆ ఇద్దరు అధికారులకు వ్యాక్సిన్ వేస్తున్నట్లుగా నర్సు ముందుకు వంగింది. అయితే వారికి సూది మాత్రం గుచ్చలేదు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. విమర్శలు వస్తున్నాయి. 

 అయితే దీనిని తుమ్కూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రాకేశ్ కుమార్ ఖండించారు. ఇది తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పేర్కొన్నారు. ఈ వైద్యాధికారులు ముందే వ్యాక్సిన్ వేసుకున్నారన్నారు. అయితే ప్రెస్ రిపోర్టర్లకు టీకా ఇంజెక్ట్ చేసుకున్న ఫొటోలు రాలేదని, వారి టీకా వేయించుకుంటున్నట్లు ఫోజులు ఇవ్వాలని కోరారని తెలిపారు. దీంతో వారు అలా చేశారని వెల్లడించారు. అంతే కాని వారు టీకా తీసుకున్నట్లు నటించలేదని స్పష్టం చేశారు. స్థానిక టీవీ రిపోర్టర్లు కూడా వారి అభ్యర్థన మేరకు ఫొటోలు, వీడియోలకు ఫొజులిచ్చారని పేర్కొన్నారు. 

 

Leave a Comment