మీడియా కథనాలు అవాస్తవం..

సస్పెన్షన్ పై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి డీజీపీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఆయన స్పందించారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తానన్నారు. 

అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక…

ఆయన 1989 ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఏడీజీపీగా పని చేసినప్పుడు ఆయన నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారు.  ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. సస్పెన్షన్ లో ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేనిదే విజయవాడలోని హెడ్ క్వార్టర్స్ ను వదిలి వెళ్లకూడదని పేర్కొంది. 

Leave a Comment