పింఛన్లు రాని వారికి న్యాయం చేసేందుకు చర్యలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

అమరావతి : రాష్ట్రంలో పింఛన్లు మంజూరు కాని వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అర్హతలు ఉండి పెన్షన్ రాని వారిని గుర్తించేందుకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. తమకు పెన్షన్ రాలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్ద ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ వచ్చి పరిశీలిస్తారన్నారు.  అర్హులని నిర్ధారణ జరిగితే ఫిబ్రవరి పెన్షన్ కూడా కలిపి మార్చి నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ చెల్లిస్తారని పేర్కొన్నారు. నవశకం సర్వే ద్వారా రాష్ట్రంలో అర్హులైన పెన్షనర్ల గుర్తించామన్నారు. కొత్త ఈ నెలలో 6.14 లక్షల మందికి పెన్షన్ల మంజూరు చేశామని, అర్హత లేని కారణంగా 4.80 లక్షల మందికి పెన్షన్ తొలగించామని తెలిపారు. 

అర్హులు ఆందోళన చెందవద్దు..

అర్హులైన వారికి పెన్షన్ అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  ప్రస్తుతం తొలగించిన పెన్షన్లపై కూడా సమగ్ర పరిశీలన చేయిస్తామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందుతుందని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారన్నారు. అర్హతగల వారు ఎవరైనా పెన్షన్‌ కోసం సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో పెన్షన్ మంజూరు చేస్తామన్నారు.

Leave a Comment