నాన్న జ్ఞాపకం.. పదిలం చేసుకున్నాడు..!

నాన్న అంటే ఒక ధైర్యం. ఒక బాధ్యత.. భరోసా.. జీవితాంతం బిడ్డలను భుజాలపై మోస్తూ.. వాళ్ల సుఖం కోసం తన రక్తాన్నిచెమటగా మారుస్తాడు. తన అవసరాలు, ఆనందాలు అన్ని పక్కన పెట్టి.. పిల్లల సంతోషం కోసం జీవిస్తాడు. చిన్నప్పుడు వేలు పట్టి నడక నేర్పిన నాన్న.. జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తాడు.. అలాంటి నాన్న జ్ఞాపకాన్ని ఓ వ్యక్తి పదిలంగా దాచుకున్నాడు. తన తండ్రి ఎంతో ఇష్టంగా చూసుకునే స్కూటర్ ని సరికొత్తగా మార్చుకున్నాడు విశాఖపట్టణానికి చెందిన రమేష్..

రమేష్ తండ్రి అప్పలస్వామి ఆర్మీలో పనిచేశారు. 1994లో లాంబ్రెట్టా మోడల్ లాంబి 150 స్కూటర్ ని కొనుగోలు చేశారు. ఆయన రిటైర్ అయ్యాక ఆ స్కూటర్ వాడడం మానేశారు. దీంతో అది పూర్తిగా పాడైపోయింది. తన నాన్న వాడిన స్కూటర్ ని మెరుగ్గా తీర్చి దిద్దారు రమేష్..ప్రస్తుతం ఈ స్కూటర్ల వాడకం కనుమరుగైపోయింది. దీంతో దీని విడి భాగాల కోసం ఎంతో కష్టపడ్డాడు. ఒరిజనల్ పార్ట్స్ కోసం విశాఖపట్నంతో పాటు కర్నాటక, ఢిల్లీ, ముంబాయి, కేరళ తిరిగారు. స్కూటర్ ఆయిల్ ట్యాంక్, ఫోర్కు, ఫోర్క్ బాల్స్ సెట్ తదితర పార్టులు మార్కెట్ లో లభించకపోవడంతో తానే సొంతంగా డిజైన్ చేసి తయారు చేసుకున్నారు. ఆరేళ్ల పాటు కష్టపడి స్కూటర్ ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు.

స్టీల్ ప్లాంట్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న రమేష్.. తన విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్కూటర్ ని తయారు చేస్తూ ఉండేవారట.. ఈ స్కూటర్ తన నాన్నకు ఎంతో ఇష్టమని, అందుకే దీన్ని రిపైర్ చేశానని రమేష్ చెప్పారు. దాదాపు రూ.4.5 లక్షలు వెచ్చించి స్కూటర్ తయారు చేసినట్లు తెలిపారు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే దేశం మొత్తం మీద 10 లోపు స్కూటర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఎంతో కష్టపడి తయారు చేేసిన ఈ స్కూటర్ పై తన తండ్రితో పాటు తిరిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పొంగిపోతున్నాడు.. మీకు కూడా మీ నాన్న జ్ఞాపకాలు ఏవైనా ఉంటే వాటిని పదిలంగా పెట్టుకోండి.. 

Leave a Comment