ఎన్పీఆర్ తో నియోజకవర్గాల పెంపునకు లింకు 

నియోజకవర్గాల సంఖ్య పెంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మూడు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతోంది. ఇక్కడి అధికార పార్టీలకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్రంలోని అధికార పార్టీ సిద్ధంగా లేకపోవడం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజన జరగడం లేదని టీఆర్ఎస్, వైసీపీలు భావిస్తున్నాయి.

అందుకే బీజేపీపై రెండు పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు మూడు పార్టీల మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశాన్ని చేర్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే కొత్త నియోజకవర్గాలు వస్తాయని కోటి ఆశలతో టీఆర్ఎస్ నేతలు ఎదురుచూశారు. కానీ కేంద్రం ఈసారికి కుదరదంటూ దాటేసింది. కొన్ని సందర్భాలలో 2026 వరకు నియోజకవర్గాల పెంపు కుదరదని తేల్చి చెప్పేసింది.

దానికి తోడు 2021 జనాభా గణన తర్వాతనే వాటి ఆధారంగా 2026లో నియోజకవర్గాలను పెంచాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై రచ్చ నెలకొంది. టీఆర్ఎస్, వైసీపీలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి.

దాని వల్ల తెలుగు రాష్ట్రాల్లో జన గణన సజావుగా జరిగే అవకాశాల్లేవు. ఫలితంగా ఇప్పటికిప్పుడు కాదు..కదా కనీసం 2026 నాటికి కూడా నియోజకవర్గాల పెంపు ఉంటుందా అన్నది సందేహంగా మారుతోంది.

అప్పట్లో నియోజకవర్గాల పెంపు వల్ల తమ పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదని బీజేపీ భావించింది. నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఆంధ్రప్రదేశ్ లో గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ లాభపడుతాయని బీజేపీ భావించింది. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని అంచనా వేసింది. అందుకే అప్పుడు, ఇప్పుడు నియోజకవర్గాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

కారు పార్టీ క్రౌడ్ ఫుల్ గా మారింది. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపైనే కొందరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాలు పెరిగితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి.

మంత్రి వర్గంలో మంత్రుల సంఖ్య కూడా ఆ రేషియో ఆధారంగా పెరుగుతుంది. వీటితో పాటే ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు ..మొదటి నుంచి ఉండి అవకాశాలు రాని పాత నేతలకు పదువుల పండగే..కానీ కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల సంకేతాలు లభించడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ లోనూ నియోజకవర్గాల పెంపు కోసం వైసీపీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే కౌన్సిల్ రద్దుతో కలవరం చెందుతున్న వైసీపీ నేతలు కొత్త నియోజకవర్గాల పెంపుపైనే ఆశలు పెట్టుకున్నారు.

రాజకీయాల్లో ఎన్ని పదవులు వచ్చినా ఎమ్మెల్యే అవ్వాలనేది ప్రతి రాజకీయ నాయకుడి కల. దీంతో నియోజకవర్గాలు పెంచితే తమ కలను నెరవేర్చుకునేందుకు వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే వీరి ఆశలపై నీళ్లు చల్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసలు నియోజకవర్గాల పెంపు ఆలోచన లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. 

కిషన్ రెడ్డి తాజాగా కేంద్ర వైఖరి ఎంటో తెలియజేయడంతో అటు కేసీఆర్, ఇటు జగన్..ఇద్దరు సీఎంలు ఏం చేయబోతున్నారని ఆసక్తిగా మారింది. ఎన్ని సార్లు విన్నవించుకున్నా బీజేపీ పెద్దల అభిమతం మారడం లేదనడానికి కిషన్ రెడ్డి వ్యాఖ్యలే ఉదాహరణ అంటూ మండిపడుతున్నారు టీఆర్ఎస్, వైసీపీ నాయకులు. జనాభా గణన కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్, వైసీపీలకు నియోజకవర్గాల పెంపును డిమాండ్ చేసే అర్హత లేదన్నది కమలనాథుల వాదన.

Leave a Comment