శుక్రవారం ఆటో ఫ్రీ.. ప్రశంసలు అందుకుంటున్న ఆటో డ్రైవర్..!

మనం ఎవరికైనా సాయం చేయాలంటే పెద్ద ధనవంతులే కానక్కరలేదు. ఎవరి ఫీల్డ్ లో ఉన్నవారు తమకు తోచిన విధంగా సాయం చేస్తే చాలు.. అది చిన్న సాయమైనా సరే.. ఇలా చేస్తే చాలా మంది సమస్యలు పరిష్కారమవుతాయి.. అలా తన రంగంలో తనకు తోచిన చేస్తున్నాడు కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ ఖాదర్ బాష.. ప్రయాణికుల కోసం ఫ్రైడే ఫ్రీ ఆటో సేవలు అందిస్తున్నాడు. 

కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ కి చెందిన ఖాదర్ బాష ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజుకు 300 నుంచి 600 వరకు సంపాదిస్తున్నాడు. ప్రజలకు ఏదైన సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.. అయితే తన వద్ద సేవా కార్యక్రమాలు చేసేంత డబ్బు లేదు. దీంతో ఓ వినూత్న ఆలోచన చేశాడు ఖాదర్ బాష.. వారంలో ఒక రోజు ఉచితంగా ఆటో సర్వీస్ చేయాలనుకున్నాడు. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలకు ఉచితంగా ఆటో సేవలు అందిస్తున్నాడు.. 

వృద్ధులు, మహిళలు, విద్యార్థులకు ఉచితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాడు. డబ్బులు లేక తాను చాలా దూరం కాలినడకన వెళ్లాల్సి వచ్చేదని, ఆ బాధ తెలిసే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ఖాదర్ బాష చెబుతున్నాడు. కర్నూలులో పది రూపాయల డాక్టర్ ఇస్మాయిల్ ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని అంటున్నాడు.. ఉచిత ఆటో సర్వీస్ అందిస్తున్న ఖాదర్ బాషపై నగర వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Leave a Comment