ప్రియురాలి కోసం స్నేహితుడినే చంపేశాడు..!

ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది..చివరికి ఒక స్నేహితుడి ప్రాణాలను తీసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మురి ప్రేమ్ చంద్ మంచి దోస్తులు.. వారిలో ప్రేమ్ చంద్ ఒక మహిళను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెతో మాట్లాడేందుకు అతని వద్ద ఫోన్ లేదు. దీంతో తన స్నేహితుడైన గోపీవర్మ ఫోన్ తీసుకుని తరుచూ మాట్లాడేవాడు. 

అయితే గోపీ కూడా ప్రేమ్ చంద్ కు తెలియకుండా అదే నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఈ విషయం ప్రేమ్ చంద్ కు తెలిసింది. దీంతో ఇద్దరు పలుమార్లు గొడవలు పడ్డారు. ఈనెల 2న కూడా ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. తన ప్రేమకు అడ్డుగా మారిన గోపీవర్మను ఎలాగైన చంపేయాలని ప్రేమ్ చంద్ నిర్ణయించుకున్నాడు.

గొడవ జరిగిన రోజు రాత్రి ప్రేమ్ చంద్ యడ్లపాడు-నాదెండ్ల మార్గంలోని చప్టా వద్ద గోపీవర్మను పిలిపించాడు. ముందుగానే కూల్ డ్రింక్ లో గడ్డి మందును కలిపి పెట్టుకున్నాడు. గోపీ రాగానే అతనితో ఈ కూల్ డ్రింక్ తాగించాడు. తర్వాత గోపీకి మందు కలిపిన విషయం చెప్పేశాడు. దీంతో గోపీ వెంటనే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. వారు గోపీని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈనెల 7న గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

 

Leave a Comment