75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తీసుకొచ్చింది. ఫ్లాగ్ కోడ్ లో మార్పులు చేసింది.. దేశంలో ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగుర వేసేందుకు కేంద్రం అనుమతించింది. అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేసేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు చేశారు.
మువ్వన్నెల జెండా వినియోగంలో రకరకాల నిబంధనలు, ఆంక్షలు ఉన్న నేపథ్యంలో వాటిని సవరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నోటిఫికేషన్ విడుదల చేశారు. అజాదీ కా అమ్రిత్ మహోత్సవాల్లో భాగంగా ఏడాది పొడవున పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఫ్లాగ్ కోడ్ లో సవరణలు:
- అజాదీ కా అమ్రత్ మహోత్సవాల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు “హర్ ఘర్ తిరంగ” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు అనుమతించారు. దేశ పౌరులంతా జాతీయ జెండాను స్వేచ్ఛగా తమ ఇళ్లపై ఎగురవేసేందుకు కేంద్రం అనుమతించింది.
- ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ప్రతి పౌరుడు జాతీయ జెండాను ఇంటిపై పెట్టుకోవచ్చు. ఎగరవేయొచ్చు. రాత్రి పగలు తేడా లేకుండా ఇంటిపై జెండాను ఉంచేందుకు అనుమతించారు.
- ఇది వరకు కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే ఎగురవేసేవారు.. తాజాగా కాటన్, పాలిస్టర్, సిల్క్, ఉల్ వస్త్రాలతో జెండాను తయారు చేయొచ్చు. ఈమేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కు సవరణలు చేసింది.