ఆస్తి తీసుకొని.. తల్లిదండ్రులను బయటకు గెంటేసిన కొడుకులు..!

కన్న బిడ్డలను ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు.. కని.. పెంచి.. పోషించి.. వారు పెద్దయ్యాక వారికి చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటారు. కానీ పెద్దయ్యాక ఆ తల్లిదండ్రులే వారికి భారమవుతారు. తాజాగా తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని బయటకు గెంటేశారు కొడుకులు. దీంతో ఆ వృద్ధ దంపతులు సామాజిక భవనంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ లో జరిగింది. 

గ్రామానికి చెందిన అయిలయ్య(90), రావమ్మ(85)లకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయిలయ్యకు 6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ముగ్గురు కుమారులకు పంచిపెట్టాడు. ఇల్లు ఏమో తన మూడో కొడుకుకు ఇచ్చాడు. దీంతో ఆ కొడుకు దాని స్థానంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి పక్కన చిన్న రేకుల షెడ్డు నిర్మించి అందులో తల్లిదండ్రును పెట్టాడు. 

కొన్నాళ్లకు తల్లిదండ్రులను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆ దంపతులు చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వృద్ధాప్య పెన్షన్ తో జీవనం కొనసాగించేవారు. అయితే మూడు నెలల క్రితం గ్రామ పెద్దలు చర్చించి ఆ దంపతులను ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెల రోజుల చొప్పున చూడాలని నిర్ణయించారు. 

దాని ప్రకారం ఇద్దరు కుమారుల వద్ద నెల రోజుల చొప్పున గడిపారు. ఇక మూడో కుమారుడు మాత్రం తల్లిదండ్రులను రానీయలేదు. పెద్ద కుమారుడు వారి సామగ్రిని బయటపడేశాడు. దీంతో కొన్ని రోజులుగా వారు స్థానిక సామాజిక భవనంలో ఉంటున్నారు. ఈ విషయం తెలిసి ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులను కలెక్టరేట్ కి తీసుకొచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేయించారు. 

Leave a Comment