సీఎం జగన్ చేతుల మీదుగా కామధేను పూజ..!

  కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేట లో శుక్రవారం  నిర్వహించిన కామధేను పూజ (గోపూజ) లో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పంచకట్టు, కండువతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఆ ప్రాంగణంలోని గోమాతలు, నందీశ్వరులు( ఎద్దు) అలంకరణలు చూశారు. అనంతరం గో పూజకు గోత్ర నామాలతో ఆయన సంకల్పం చేసుకున్నారు.

 వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల నడుమ జగన్మోహన్ రెడ్డి గోమాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. గోమాత, దూడ కు ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించారు. టీటీడీ అర్చకులు సీఎం జగన్ ను శేష వస్త్రం తో సత్కరించారు. ఇస్కాన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి జ్ఞాపిక ను అందించారు. స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రిని గజమాలతో సన్మానించారు.

      ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. గోపూజ వల్ల రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Leave a Comment