పెళ్లయిన 3 రోజులకే.. లవర్ తో పెళ్లి కూతురు జంప్..!

కాలం మారింది.. పెళ్లి చేశాములే.. సర్దుకుపోతారులే అన్నట్లు లేదు ఈరోజుల్లో.. మనసులో ఒకరిని ఉంచుకొని.. మరొకరితో పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడటం లేదు.. పెళ్లి చేసుకున్నా.. ప్రేమించినవాడితో వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. పెళ్లయిన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది.. ఈ వ్యవహారంతో వివాదానికి దారితీసింది. కుటుంబ సభ్యులు పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు.. 

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 9న సమీప గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తిని ఆ యువతి ప్రేమించింది. ఇంట్లో వాళ్ల ఒత్తిడితో నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అందుకే అదను చూసి పెళ్లయిన మూడు రోజులకే ప్రేమించిన యువకుడితో పారిపోయింది. 

విషయం తెలియడంతో యువతి బంధువులతో పాటు, పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేశారు. శివాజీ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇల్లు కాలిబూడిదైంది. ఇంట్లో ఉన్న బియ్యం, వస్తువులు కాలిపోయాయి. ఆ సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంత్రాలయం ఎస్సై కుళ్లాయప్ప వెళ్లి గొడవను అదుపు చేశారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రియుడిపై కేసు నమోదు చేశారు.

 

 

Leave a Comment