మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. కరోనాతో పోరాటంలో ఓడింది.. పుట్టిన రోజు నాడే మృతి..!

ఓ యువతి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవిత పోరాటంలో గెలిచింది. అయితే కరోనాతో పోరాటంలో మాత్రం ఓడింది.. పుట్టిన రోజునాడే తుదిశ్వాస విడిచింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడికి చెందిన జాజావ్ గంధర్ మూడో కుమార్తె జాజావ్ విజయ(26) తాడ్వాయి రెవెన్యూ కార్యాయలంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఆమె మూడు ఉద్యోగాలు సాధించి సత్తాచాటింది. మొదట అటవీశాఖ బీట్ ఆపీసర్ గా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు వచ్చాయి. దీంతో పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరారు. మల్లుపేట్ లో ఉద్యోగం చేస్తూనే గ్రూప్-4 పరీక్ష రాసి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైంది. 

ఉద్యోగం రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు  వారం క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లివచ్చారు. జ్వరం రావడంతో బుధవారం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయతో పాటు తల్లి, అక్కకు కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం విజయకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. దీంతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విజయ మృతి చెందింది. మరో విషాదం ఏంటంటే.. పుట్టినరోజు నాడే ఆమె మృత్యుఒడిలోకి చేరింది. దీంతో ‘పుట్టినరోజు నాడే చనిపోయావా తల్లీ’ అంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  

Leave a Comment