లద్దాఖ్ లో తెలంగాణకు చెందిన జవాన్ మృతి..!

దేశ రక్షణ కోసం గత 19 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఎప్పుడూ ఉద్రిక్తలు ఉండే లద్దాఖ్ లో విధులు నిర్వహించాడు. కానీ తన విధులు ముగించుకుని వెళ్తున్న జవాన్ కు కొండచరియల రూపంలో మృత్యువు కబళించింది. కొండచరియలు విరిగిపడి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన షేక్ షాకీర్ హుస్సేన్(38) మృతి చెందారు. ఈ ఘటన శనివారం జరిగింది. 

షాకీర్ హుస్సేన్ 2001లో ఆర్మీలో చేరారు. 2016లోనే షాకీర్ తన 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. అయినా దేశ రక్షణ కోసం మరో ఐదేళ్లు సర్వీసును పొడిగించుకుని ప్రస్తుతం లద్దాక్ లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని తోటి జవాన్లతో కలిసి క్యాంపునకు వెళ్తుండగా కొండచరియాలు విరిగిపడ్డాయి. దీంతో షాకీర్ కి తీవ్రగాయాలు అయ్యాయి. 

సెక్టార్ ఆఫీస్ అధికారుల నుంచి ఉదయం 10.30 గంటలకు షాకీర్ కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ప్రమాదం జరిగిందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. తిరిగి 12 గంటల సమయంలో అధికారులు షాకీర్ ఫ్యామిలీకి బ్యాడ్ న్యూస్ ను అందించారు. షాకీర్ చనిపోయినట్లు సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షాకీర్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి తన భార్య, కుటుంబీకులతో షాకీర్ చివరిసారిగా మాట్లాడారు. షాకీర్ మరణంతో కాగజ్ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.  

 

Leave a Comment