మంత్రి ఈటలకు షాక్.. వైద్య ఆరోగ్య శాఖ తొలగింపు..!

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈటల తమ భూములు కబ్జా చేశాడని రైతులు ఫిర్యాదు చేయడంతో సీఎం కేసీఆర్ తక్షణమే విచారణకు ఆదేశించారు. ఈక్రమంలో ఈటలకు భారీ షాక్ తగిలింది. ఈటల నుంచి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రస్తుతం ఈటల రాజేందర్ ఏ శాఖ లేని మంత్రిగా ఉండనున్నారు. ఈటల మంత్రి పదవులను తనకు బదిలీ చేయాలంటూ కేసీఆర్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. కాగా ఈటల రాజేందర్ రైతులకు చెందిన అసైన్డ్ భూములను కబ్జా చేశారని ప్రాథమిక విచరణలో తేలిందని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. మరోవైపు ఈటలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ భూముల్లో మంత్రి రాజేందర్ పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్ లు నిర్మించారని కలెక్టర్ ధ్రువీకరించారు. 

అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఈటల రాజేందర్ ఖండించారు. అసత్యాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంత్రి ఈటల కోరారు. 

Leave a Comment