ప్రతి మసీదులో శివలింగం వెతకడం సమంజసం కాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

దేశంలో ప్రస్తుతం జరుగుతోంది ఒకటే చర్చ అది మందిర్-మసీదు.. ఉత్తరప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో శివలింగం వెలుగు చూసిందన్న విషయంపై వివాదం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఈక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

జ్ఞానవాపి మసీదు – కాశీ విశ్వనాథ ఆలయ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ఇరువర్గాలూ కూర్చుని పరిష్కారం కనుగొనాలని సూచించారు. కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తి ఉంటుందని, వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతామని, కానీ ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయం ఎందుకని భగవత్ ప్రశ్నించారు. 

నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ప్రసంగించారు. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చని, అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదని, ఇప్పుడున్న హిందువులు, ముస్లింలు దానిని సృష్టించలేదని అన్నారు. 

బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు దేవస్థానాలను నాశనం చేశారని, అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదని భగవత్ అన్నారు. సమిష్టిగా సమస్యకు పరిష్కారం కొనుగొనాలని సూచించారు. అది కుదరనప్పుడే కోర్టులకు వెళ్లాలని, అక్కడ ఎలాంటి తీర్పు వచ్చినా అంగీకరించాలని తెలిపారు. 

ఆరెస్సెస్‌.. ఏ మత  ప్రార్థనా విధానాలకూ వ్యతిరేకం కాదని, అందరినీ అంగీకరిస్తుందని భగవత్ అన్నారు. అందరినీ పవిత్రంగానే భావిస్తుందన్నారు. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలని మోహన్ భగవత్ అన్నారు. 

 

Leave a Comment