కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ 2020 వాయిదా..

కరోనా వైరస్ ఐపీఎల్ నూ వదల్లేదు. దేశంలో కరోనా ప్రబలుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఐపీఎల్ 2020 పై ఆంక్షలు విధించింది. దీంతో ఐపీఎల్ ను వాయిదా వేయడానికి బీసీసీఐ సముఖంగా ఉంది. కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఐపీఎల్ వాయిదాపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తీసుకుంటే ఐపీఎల్ ను వాయిదా వేయడమే సమంజసమని అభిప్రాయపడ్డారు. అంతేగాక ఐపీఎల్ సీజన్ కు విదేశీ ఆటగాళ్లు కూడా ఏప్రిల్ 14 వరకు అందుబాటులో ఉండరన్నారు. ఇదే విషయమై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా లీగ్ రెండు వారాలు వాయిదా వేయాలని కోరాయన్నారు. దీంతో ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శనివారం ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. దీంతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సీజన్..ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయన్నారు.

Leave a Comment