మైనస్ 24 శాతానికి పడిపోయిన భారత జీడీపీ..!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎప్పుడూ లేని విధంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ నుంచి జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా మైనస్ 23.9 శాతం క్షీణించిందని కేంద్ర గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించింది. గడిచిన 40 ఏళ్లలో ఇదే అత్యల్పం కాగా..1996 నుంచి ప్రకటిస్తున్న త్రైమాసిక జీడీపీ గణాంకాల్లో ఇదే అత్యంత పేలవం. 

కరోనా కట్టడికి మోడీ సర్కార్ సరైన కార్యాచరణ లేకుండా మార్చి 25 నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో మొత్తం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. తయారీ రంగమూ కుప్పకూలింది. ప్రజల ఉపాధి తీవ్రంగా దెబ్బతినడంతో వారి కొనుగోలు శక్తి హరించుకుపోయింది. అంతిమంగా ఆ ప్రభావం స్థూల దేశీయోత్పత్తిపై పడింది. 

2020 మార్చి త్రైమాసికంలో జీడీపీ 3.1 శాతం క్షీణించి 17 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కాగా 2019-20 జూన్ త్రైమాసికంలో 5.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత రెండేండ్లుగా క్రమంగా పడిపోతూ వస్తోన్న జీడీపీకి కరోనా తోడవడంతో క్రితం త్రైమాసికంలో తీవ్ర అగాథంలోకి జారుకున్నట్లయింది. మరోవైపు వరుసగా ఐదో మాసంలోనూ కీలక రంగాలు పేలవ ప్రగతిని కనబర్చాయి. 

Leave a Comment