Tokyo Olympics: పీవీ సింధూ శుభారంభం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం ఇజ్రాయెల్ కి చెందిన సెనియా పోలికర్పోవాతో జరిగిన మ్యాచ్ లో పీవీ సింధూ ఘన విజయం సాధించింది. వరుస సెట్లలో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో సింధూకు పొలికర్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో సింధూ 21-7, 21-10తో విజయం సాధించింది. 

మొదటి సెట్ లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన పీవీ సింధూ 21-7తో సెట్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో సెట్ లో సెనియా కాస్త ప్రతిఘటించినా ఆమెకు పుంజుకునే అవకాశం మాత్రం సింధూ ఇవ్వలేదు. రెండో సెట్ ని కూడా 21-10తో చేజిక్కించుకుంది.  

ఇక మహిళల డబుల్స్ టెన్నిస్ లో భారత్ కు నిరాశే ఎదురైంది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన సానియా-అంకితా రైనా జోడి తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది. ఉక్రెయిన్ జంటతో జరిగిన డబుల్స్ మ్యాచ్ లో 6-0,6-7,8-10తో ఓడిపోయింది. 

రోయింగ్ లో భారత్ శుభారంభం చేసింది. లైట్ వెయిట్ డబుల్ స్కల్స్, రెపికేజ్ లో భారత్ కు చెందిన అర్జున్ లాల్, అరవింద్ జోడి సెమీస్ కు అర్హత సాధించింది. సెమీస్ లో గెలిస్తే భారత్ కు క్యాంస్యం ఖరారు అవుతుంది. 

Leave a Comment