అమెరికా సరిహద్దుల్లో చలికి గడ్డకట్టి భారత కుటుంబం దుర్మరణం..!

కెనడా, అమెరికా సరిహద్దుల్లో చలికి తట్టుకోలేక భారత కుటుంబం దుర్మరణం చెందింది. మైనస్ 35 డిగ్రీల చలిని తట్టుకోలేక కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన జనవరి 19న చోటుచేసుకుంది. అయితే మృతులను తాజాగా గుర్తించారు. వీరు గుజరాత్ కి చెందిన జగదీశ్ బల్ దేవ్ భాయ్ పటేల్(39), భార్య వైశాలి బెన్(37), కుమార్తె విహంగి(11), కుమారుడు ధార్మిక్(3) అని అధికారులు గుర్తించారు. వీరు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. 

కెనడా-అమెరికా సరిహద్దుకు 12 మీటర్ల దూరంలోని మానిటోబాలోని ఎమర్సన్ సమీపంలో జనవరి 19న మంచులో కూరుకుపోయిన నాలుగు మృతదేహాలను కెనడియన్ మౌంటెడ్ పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టుకుపోయి వీరంతా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు భారత్ కి చెందిన పటేల్ కుటుంబంగా అధికారులు గుర్తించారు. 

పటేల్ కుటుంబం సరిహద్దుకు చేరుకునే ముందు కొద్దిరోజులు కెనడాలోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు తేలింది. జనవరి 12న టొరంటో చేరుకున్న వీరు.. అక్కడి నుంచి జనవరి 18న సరిహద్దుకు వెళ్లినట్లు కెనడా పోలీసులు తెలిపారు. దీని వెనుక మానవ అక్రమ రవాణా ముఠా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటేల్ కుటుంబం మృతిని కెనడాలోని భారత హైకమిషన్ కూడా ధ్రువీకరించింది. మృతదేహాలను ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. 

Leave a Comment